
ధ్యాన మందిరం
పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి మాత ఒకరు. ఈ తల్లి కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుంది. గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులకు ఎలాంటి అనవసరపు ఆలోచనలు రాకూడదనే భావనతో గ్రంథాలయ ప్రాంగణంలో సరస్వతీ ధ్యానమందిరాన్ని 2023లో ఏర్పాటు చేయనైనది. ఈ మందిరంలో 8 అడుగుల సరస్వతీ మాత , ఆకర్షణీయ శైలిలో కొలువుదీరింది. జ్ఞాన ప్రదాయిని అయిన అమ్మవారు కొలువుదీరిన ముల్కనూరు ప్రజాగ్రంథాలయ ప్రాంగణంలో విద్యార్థులు, యువత, భక్తులు ప్రశాంతమైన నిర్మల వాతావరణంలో ఆమెను దర్శించుకుంటూ.. చదువుల బాట పడుతారు. ఈ ఆలయ నిర్మాణానికి శ్రీ గణశ్యాం పటేల్ కుటుంబం రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేసింది.

పుస్తకాలు, పెన్నులే ప్రసాదం..
ధ్యాన మందిరానికి వచ్చిన భక్తులు ఎవరైనా పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలు, నోట్‌బుక్స్, కంపాస్ బాక్సులే అమ్మవారికి కానుకగా సమర్పించాలి. నగదు రూపంలో కానుకలు స్వీకరించబడవు. ఈ విధంగా వచ్చ ిన పుస్తకాలను, పెన్నులను అమ్మవారికి నివేదించిన తర్వాత, వాటిని తిరిగి పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రసాదంగా అందించడం ఇక్కడ నిరంతరం కొనసాగే విజ్ఞాన సంప్రదాయం.

వసంత పంచమి మరింత ప్రత్యేకం..
ధ్యాన మందిరంలో సరస్వతీ మాత అనుగ్రహానికి ఏటా వసంత పంచమి నాడు ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కుల, వర్గ తారతమ్యం లేకుండా చుట్టు పక్కల గ్రామాల పిల్లలందరికీ అక్షరాభ్యాసం జరుగుతుంది. సరస్వతి విగ్రహంతో పాటు ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధ భగవానుడు విద్యార్థులకు ‘‘సంఘం శరణ ం గచ్ఛామి’’ అని ప్రబోధిస్తున్నట్టుగా పెద్ద వేప చెట్టు కింద కొలువుదీరి ఉన్నారు.
