
మా ముల్కనూరు
ఊరు
మండల కేంద్రమైన భీమదేవరపల్లి నుండి 2 కి. మీ. దూరం లో , సమీప పట్టణమైన వరంగల్ నుంచి 35 కి. మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2225 ఇళ్లతో, 9075 జనాభా కలిగి, 1663 హెక్టార్లలో విస్తరించి ఉంది. పిన్ కోడ్: 505471.

స్వాతంత్ర్యోద్యమంలో..
దేశ స్వాతంత్య్రం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నిస్వార్థంగా పోరాటం చేసిన నాయకులు ముల్కనూరు నుంచి ఎందరో ఉన్నారు. ఇక్కడి చుట్టుపక్కల గ్రామాలు స్వాతంత్ర్య ఉద్యమంతోపాటు, తెలంగాణలో రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించాయి. జాతీయ స్థాయిలో మచ్చలేనినేతగా ఎదిగి, ప్రధాన మంత్రిగా సేవలు అందించిన పీవీ నరసింహారావు గారు ఈ ప్రాంతానికి చెందిన వారే కావడం విశేషం. అలాంటి గొప్ప వ్యక్తుల్లో భూపతి కృష్ణమూర్తి గారు, పడాల చంద్రయ్య గారు, అలిగిరెడ్డి కాశీవిశ్వనాథ రెడ్డి గారు, బొజ్జపురి వెంకటయ్య గారు , కృష్ణమాచార్య గారు, పౌలు గారు, రావులపల్లి దామోదర్ రావుగారు ఉన్నారు.
సొంత ఆస్తులను సైతం ఉద్యమాల కోసం ధారపోసిన త్యాగశీలురు, జాతీయ స్థాయిలో అభిమానులను పొందగలిగిన ఎందరో నేతలు ఈ ప్రాంతం నుంచి వెళ్లినవారే. అలాగే మా గురువులు శ్రీమతి సరోజిని, శ్రీయుతులు కోడూరి రాజయ్యగారు , శ్రీనివాసాచార్య గారు , సంపత్ కుమార్ గారు , ఎం రాజయ్య గారు, భూపతి రవీందర్ గారు, తా రాబాయి గారు భావి తరాలకు ఆదర్శప్రాయులు.


కో ఆపరేటివ్ సొసైటీ
ముల్కనూర్ కో-ఆపరేటివ్ సొసైటీ ప్రధానంగా వ్యవసాయం , అనుబంధ కార్యకలాపాలకు రుణాలు అందించే సహకార సంఘం. ముల్కనూర్ కో-ఆపరేటివ్ సొసైటీ 1956లో స్థాపించబడింది. ఈ సొసైటీ రైతులందరికీ సేవలందిస్తుంది, గ్రామీణ మహిళా సాధికారతకు తోడ్పడుతుంది. ఆసియాలోనే రెండో అతిపెద్ద సహకార సంఘంగా పేరుగాంచింది. వ ్యవసాయాన్ని పండుగగా మార్చిన ఘనత ఈ సంఘానిదే.
ముల్కనూరు డైరీ..
ములుకనూరు మహిళా సహకార డైరీ (MWCD) భారతదేశంలో మొట్టమొదటి మహిళా సహకార డైరీ.. ఇది మహిళలచే స్థాపించబడి, నిర్వహించబడుతుంది మరియు పాలు , పాల ఆధారిత ఉత్పత్తుల్లో దేశవ్యాప్తంగా పేరుగాంచింది.
ముల్కనూరు మహిళలు మరియు ఇతర గ్రామాల్లోని మహిళలకు ప్రయోజనం చేకూర్చే ఆలోచనలో భాగంగా.. పెట్టుబడి మార్గాలను కూడా అన్వేషిస్తున్న క్రమంలో, మహిళల వద్ద పాడి పశువులు ఉన్నాయని వారు ఇప్పటికే పాలను అమ్ముతున్నారని గ్రహించారు. ఈ విధంగా, సహకార ఆధారంగా డైరీని ప్రోత్సహించాలనే ఆలోచన ఉద్భవించింది. అప్పటి నుంచి మొదలైన డైరీ దేశంలోనే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది.
