
శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి
ముల్కనూర్ పీఠనిలయే సరస్వతి నమోస్తుతే.


శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి
ముల్కనూర్ పీఠనిలయే సరస్వతి నమోస్తుతే.
పుష్పాభిషేకం
గంట
కొట్టండి



ABOUT US
సాహితీ సేవలో
ముల్కనూరు ప్రజా గ్రంథాలయం ప్రధాన సలహాదారు శ్రీ వేముల శ్రీనివాసులు తన మిత్రులతో తెలుగు సాహిత్యం, ముఖ్యంగా కథా సాహిత్యం గురించి చర్చించినప్పుడు తెలుగు కథను, కథా రచయితలను ప్రోత్సహించాలని అలాగే కొత్త రచయితలను గుర్తించాలని అనుకున్నారు. అందుకోసమై నమస్తే తెలంగాణ దినపత్రిక సంపాదకులు శ్రీ కట్టా శేఖర్ రెడ్డి గారిని సంప్రదించగా ఆయన తాము కూడా ఇలాంటి ఆలోచనే చేస్తున్నట్టు చెప్పారు. తెలుగు కథకు కొత్త వెలుగులు తీసుకురావాలని నిశ్చితాభిప్రాయానికి వచ్చి ముల్కనూరు సాహితీ పీఠం వారు, నమస్తే తెలంగాణ వారు సంయుక్తంగా కథల పోటీలను నిర్వహించి గణనీయమైన బహుమతులను ఇవ్వాలని, తద్వారా తెలుగు కథా రచయితలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. అలా 2019 లో మొదలైన కథల పోటీలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. ఈ పోటీలలో బహుమతులు సాధించిన కథలు నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధం ‘బతుకమ్మ’లో ప్రచురితం అవుతున్నాయి. దీంతోపాటు బహుమతి పొందిన కథలతో ప్రతి సంవత్సరం ముల్కనూరు సాహితీ పీఠం ఆధ్వర్యంలో కథా సంకలనం కూడా వెలువడుతోంది.
ప్రజా గ్రంథాలయం – సాహితీ పీఠం ఆధ్వర్యంలో రూ.50,000 ల ప్రథమ బహుమతి, రూ.25,000 -ల ద్వితీయ బహుమతులు రెండు, రూ.10,000/- –ల తృతీయ బహుమతులు కనీసం మూడు, కనీసం ఆరు కథలకు రూ .5000/–-ల చొప్పున విశిష్ట బహుమతులను ఇవ్వడం జరుగుతున్నది. ఇవేకాక గణనీయమైన సంఖ్యలో కథలను ఎంపిక చేసి రూ. 3000, 2000 ల బహుమతులను కూడా ప్రదానం చేస్తున్నారు. కంప్యూటర్, కృత్రిమ మేధా ప్రపంచంలో కూడా నిలబడే సాహితీ ప్రక్రియల్లో కథ ముందు వరుసలో ఉండి, సమజాన్ని ఉన్నతీకరిస్తుందనే నమ్మకంతోనే సాహితీ పీఠం ఈ కార్యక్రమాన్ని పవిత్రంగా నిర్వహిస్తోంది.

01
సామూహిక సంకల్పం..
యజ్ఞ కార్యం సమైక్యతను, సమృద్ధిని కాంక్షించి, రుగ్మతలను తొలగించినట్లు.. ఈ సాహితీ యజ్ఞంతో సమతుల్యతను, సామరస్యాన్ని పెంపొందించే కథలను ఈ పోటీల ద్వారా పాఠకుల ముందుంచుతున్నాం. లోతైన ఈ కథలు రచయిత అంతరంగాన్ని ఆవిష్కరించడమే కాక.. హోమ ధూమంలా పాఠకులందరి మనసునూ చేరుతాయి. మాకు కథలు రాస్తున్న ప్రతి రచయితా.. సరస్వతీ సన్నిధిలో అక్షర హవిస్సును సమర్పించే సాహితీ సాధకుడని చెప్పవచ్చు. పోటీలలో నిలిచిన కథలను చదివి, ప్రేరణ పొంది తామూ కథలు రాయాలనే కంకణం కట్టుకుని విజేతలుగా నిలిచిన రచయితలున్నారు. ఇందులో పాల్గొంటున్న కొందరు రచయితలు.. పాఠకుడిగా మారి కథ చదవగలరు, విమర్శకునిగా తమ కోణాన్ని పంచుకోగలరు. విశ్లేషకునిగా కథలను విశ్లేషించనూగలరు. ఇలాంటి బహుముఖ సాహిత్య చర్చలకు, వారం వారం సమీక్షలకు, ఇష్టాగోష్ఠికి ముల్కనూరు కథా డిజిటల్ వేదిక అయిన వాట్సాప్ గ్రూప్ నాణ్యంగా నడుస్తోంది.

02
సార్వత్రిక లక్షణం
యజ్ఞ విశిష్టత దాని సార్వత్రిక లక్షణంలో ఇమిడి ఉంటుంది. అది కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా అందరినీ ఒక తాటిపైకి తెస్తుంది. అచ్చు అలాగే ముల్కనూరు కథల పోటీ కూడా సామాజిక వైవిధ్యాన్ని గౌరవిస్తూ, సమస్త జీవరాశుల మధ్య ఐక్యతను స్థాపించడంలో తన వంతు పాత్ర పోషిస్తోంది. ఈ మహత్తర కార్యం సామాజిక నిధిలా ఉండేందుకు ఏటా కథలను సంకలనంగా తేవడం మేము మర్చిపోవడంలేదు. ఈ మా ప్రయత్నం.. పాఠకులకు ఆనందాన్ని, స్ఫూర్తిని అందిస్తూ తెలుగు సాహిత్య లోకంలో కొత్త కుసుమాలు వికసించేలా ప్రేరణనిస్తుందని ఆశిస్తున్నాం.
