నా బలగం
- vinoo Sparkles
- Sep 9
- 6 min read
డా. శ్రీదేవి శ్రీకాంత్ - మొబైల్ నంబర్ +267 76 279 761
నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం సంయుక్తంగా నిర్వహించిన
కథల పోటీ 2023–24'లో రూ.2 వేల బహుమతి పొందిన కథ.

"నాన్న గారు ఎన్ని సార్లు ఫోన్ చేశానో నిన్నటి నుండి"
"చెవుడు మిషన్ యెక్కడ పెట్టానో. కనబడలేదు తల్లీ!"
"నీ చెవుడు మిషన్ కు మాట్లాడే యంత్రం మేదైనా జత చేర్చాలి నాన్నా."
"వస్తాయి ఆరోజులూ. అవీ కని పెడతారు".
"నాన్నా! బాగా దగ్గుతున్నారు. ఎక్కువ మాట్లాడకండి."
"దగ్గుదేముంది గానీ, మీరంతా వచ్చెయ్యండి.”
"నాన్నగారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు."
"నాకు పిలుపు రాబోతోంది తల్లీ! నన్ను చూడడానికి వెంటనే రండి. నేను పోయాక వచ్చి ఫలితం ఏముంది?
ఎందుకో రోజులు దగ్గర పడ్డాయి అనే సంకేతాలు పదేపదే
కనిపిస్తున్నాయి."
"నాన్నా! అలా అనకండి. వస్తాములే. నేను చెల్లితో మాట్లాడి ఇద్దరం వస్తాము."
"సరే నాన్నా! అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వండి."
"అమ్మా! ఎలా ఉన్నావు!?"
"నిన్నటికి ఈ రోజుకు ఏమైపోతాను గానీ, నిన్న నువ్వు ఫోన్ చేసినప్పుడు చెబుదాము అనుకుని చెప్పలేదు. ఎక్కడో అమెరికాలో ఉన్న మిమ్మల్ని కంగారు పెట్టడం ఎందుకని!?
"ఏమ్మా! ఏమయ్యింది?"
"ఏమ్మా!? అంటే ఏమి చెప్పను!? ఎలా ఉన్నాను? అంటే ఒకటే ఆందోళన."
"దేనికమ్మా!?"
"మీనాన్న గారు "నేను పోయాక పిల్లల దగ్గరికి వెళతావా!? వాళ్ళు చాలా పని బిజీలో ఉంటారు. అందులో అమెరికాలో పనివాళ్ళు కూడా ఉండరు.నీకూ పనిచేసే ఓపిక కూడా లేదు. వాళ్లకు ఏమి సాయం చేస్తావు!? నాతో వచ్చేస్తావా!” అంటున్నారు."
“నిజానికి మొన్న షుగర్ డౌన్ అయ్యి, బీపీ డౌన్ అయ్యి మూడు రోజులు ఆసుపత్రిలో ఉన్న నాకు, నేను పోతే మీ నాన్న జీవితం ఎలాగా అనుకున్నా?
మందులు వేసుకున్నా వెంటనే కొలుకో లేక పోయాను.
మిమ్మల్ని రమ్మని చెప్పాలి అనిపించింది."
"రమ్మని పిలిస్తే వస్తాము కదా!? మీ కన్నా మాకు ఏమి కావాలి?”
“అమెరికాలోఒక్క నెల జీతం పోతే బోలెడు డబ్బు పోతున్నట్టు ఉంటుంద” అని మన పక్కింటి వాళ్ళ అబ్బాయి రమ్మంటే వాళ్ళమ్మతో అంటాడట. వాళ్ళ అమ్మ చెప్పే మాటలు గుర్తువచ్చాయి."
"అందరూ ఒకేలా ఉండరు అమ్మా! మాది మీ పెంపకం."
"నాన్న కు ఏమయ్యిందమ్మా!?"
"ఇదిగో మీ నాన్న మళ్ళీ నీతో మాట్లాడాలి అంటున్నారు."
"హలో! నాన్నా!”
“తల్లీ!కొడుకులు లేని నాకు ముగ్గురు కూతుర్ల లో నువ్వు కొడుకులా నాకు అండ. నువ్వు దగ్గర ఉంటే నాకు కాస్త ధైర్యం ఎక్కువ.వెంటనే బయలు దేరి రా. నేను బ్రతికి ఉండగా కనీసం ఒక నెల అయినా మీతో కబుర్లు చెప్పాలి."
"నాన్నా! అలా అనకండి. నాకు కంగారుగా ఉంది.
చెల్లాయికి కూడా ఫోన్ చేస్తాను. ఇద్దరం వస్తాము. మీరు ధైర్యంగా ఉండండి"
"పిల్లల్ని కూడా తీసుకురా. అల్లుడు గారు వస్తే
మరీ మంచిది."
***
"హలో చెల్లీ!"
"ఆ అక్కా!"
"ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు మీటింగ్ లో ఉన్నాను అక్కా! నేనే ఇప్పుడు నీకు ఫోన్ చేద్దాము
"అలాగా!? సరే గానీ నేను చెప్పే విషయం విను.
నేను ఇప్పుడు నాన్నతో, అమ్మతో మాట్లాడాను.
ఎంతో ధైర్యంగా ఉండే నాన్న ఇలా మాట్లాడటం నాకు కంగారుగా ఉంది."
"అవునక్కా! నువ్వు చెప్పే దాన్ని బట్టి నాన్న ఎందుకో భయపడుతున్నారు అనిపిస్తుంది. "చెల్లీ! నాన్న మాటల్లో ఏదో నిగూఢంగా... నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు."
“నువ్వూ బయలుదేరు.”
“అలాగే అక్కా!”
***
"నాన్నా! కిందటి సారి నేను చూసినప్పటికీ ఇప్పటికీ చాలా చిక్కి పోయావు. ఏమిటో!? మొబైల్ లో వీడియో కాల్ చేసి చూస్తే... సగం వరకే కనబడి నువ్వు ఇలా చిక్కి పోయినట్లు ఇంత ఢీలా పడిపోయినట్లు తెలియలేదు.”
"పై వాడు పిలుస్తునట్లు అనిపిస్తుంది.”
“చూడండీ అమ్మాయి.! మీ నాన్నది ఈ మధ్య ఎంత సేపూ ఇదే వాలకం.”
"నాన్నా! ఎందుకు మమ్మల్ని కంగారు పెడతారు!?"
"కంగారేమీ లేదు గానీ, తల్లీ! నువ్వు మనదేశంలో ఉన్నంత వరకు నా కళ్ళ ఎదురుగా చీర కట్టుకుని తిరగాలి. మనవరాలికి ఓణీ వేయించు.”
"తాత గారూ... నాకు పం చి క ట్టు కో డం ఇష్టం.
ఒక సారి మా ఆ మే రి కా లో సత్య న్నారా యణ
వ్రతం ఆప్పుడు నాన్న నాకు కట్టారు.
నీకు గుర్తు ఉందా!? పంచెల పండుగ అప్పుడు నువ్వు నాకు కట్టావు. "
"వీడు తెలుగు బాగా మాట్లాడుతున్నాడు"
"అవును అమ్మమ్మా! అమ్మ ఇంట్లో తెలుగే మాట్లాడ మంటుంది." అంది మనుమరాలు మరింత స్పష్టంగా.
***
"తల్లీ! నీ చేత్తో ఉప్మా చేసి పెట్టు. ఉప్మా పలచగా ఉండాలి."
"నాన్నా! మరింత నెయ్యి, జీడి పప్పు వేసి నీకు
ఇష్టమైనట్టు పలుచటి ఉప్మా చేశాను."
"ఈకాలు వాపు తగ్గడం లేదు. చూడు తల్లీ! నాకు డాక్టర్ చెప్పే మందుల మీద నమ్మకం ఉండదు. అందుకే ఎలా పనిచేస్తాయో గూగుల్ కొట్టి చూస్తా. ఈ ఇంగ్లీషు మందులు వేరే రోగాల్ని తెచ్చి పెడతాయి."
"నాన్నా! సాయంత్రం హాస్పిటల్ కు వెళదాము. నేనూ, చెల్లి నిన్ను రేపు ఆసుపత్రికి తీసుకుని వెళతాము."
***
"మీ నాన్నగారికి కొన్ని టెస్ట్స్ చేయాలి. ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలి."
"అలాగా డాక్టర్!" అన్నారు ముగ్గురు కూతుర్లు.
"మీ నాన్నకి కాలు నొప్పికి తగ్గిపోవడానికి కారణం... క్యాన్సర్" అన్నాడు డాక్టర్... పెట్ టెస్ట్ రిజల్ట్స్ చూస్తూ.
"........."
"మీ నాన్నగారికి క్యాన్సర్. నాల్గవ స్టేజ్ లో ఉంది. ఈ క్యాన్సర్ సాధారణంగా చివరి స్టేజ్ లోనే తెలుస్తుంది.ఇప్పటికే చాలా అవయవాలకు పాకింది. ఇంచు మించు ఓ నెలరోజులు బ్రతకవచ్చు."
"అయ్యో! ఏడ్వకండి. మీరు దగ్గరుండి
ధైర్యంగా మీ నాన్నగారిని చూసుకోండి."
"డాక్టర్! నాన్నకి ఈ విషయం తెలిస్తే తట్టు కోలేరు."
"అలాగే! మేమూ చెప్పము."
“మీరు ఈ ఐదు రోజులకు పదకొండు లక్షలు ఖర్చు పెట్టారు. నేను చెప్పాను అని ఈ ఆసుపత్రి వారికి చెప్పవద్దు. నేను ఇక్కడ చాలా కాలంగా పనిచేస్తున్నాను. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా చివరికి ప్రాణాలు దక్కడం కష్టం. నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు.ఇంటికి తీసుకుని వెళ్ళి బంధువులు అందరితో చివరి రోజులు ఆనందంగా గడప నీయండి."
"అలాగే డాక్టర్!"
"ధైర్యంగా ఉండాలి మీరిద్దరూ. ఆయన ముందు ఏడ్వకండి."
డాక్టర్! అమ్మ అన్నీ విషయాల్లో పూర్తిగా నాన్నమీదే
ఆధార పడుతుంది. అమ్మకు చెప్పాలా వద్దా!? అమ్మ మందులు ఎప్పుడు ఏమి వేసుకోవాలో తెలియదు. పూర్తిగా నాన్న మీద ఆధార పడుతుంది.అమ్మ ఎలా తట్టుకోగలదు."
"మీరు అధైర్య పడవద్దు.ధైర్యం అదే వస్తుంది. ఇదే జీవితం. జీవితం ధైర్యాన్ని ఇస్తుంది.
"యమధర్మ రాజు ధర్మ రాజును పరీక్షించడానికి యక్షుని రూపం లో వచ్చి యక్షప్రశ్నలు వేస్తాడు. అందులో ఒక ప్రశ్న...మానవునికి సహాయ పడేది ఏది అంటాడు?
"ధైర్యం" అని సమాధానం చెబుతాడు ధర్మరాజు."
"......."
“మీ నాన్నకు, అమ్మ కు ఎన్నో సార్లు ఆరోగ్యం బాగోనప్పుడు
ధైర్యం చెప్పి మందులు ఇచ్చాను. మందుల కన్నా నాధైర్య వచనాలే బాగా పనిచేసాయి” అన్నాడు మీ నాన్న.
“ధైర్యం అన్ని వేళలా శ్రేయస్కరమైంది. నేను మీ నాన్న ఎన్నో సంవత్సరాలుగా స్నేహితులం."మీనాన్నకు ఈ మధ్య ధైర్యం సన్నగిల్లింది.
"మానవుడు మనిషి ఎందుకు అయ్యాడు?"
నేను చెబుతాను. మృత్యు భయం వల్ల.
దేని వల్ల మనిషి స్థిరంగా ఉండలేడు.
భయం వల్ల. ఇది జీవితం. మృత్యువు ప్రతి ఒక్కరికీ
తప్పదు. ఈ వాక్యాలు ధర్మరాజు చెప్పినవి. సత్య వచనాలు."
"చూడండి! నా మాటవిని ధైర్యంగా ఉండండి. ఇలా ఏడ్వ కూడదు. మీ అమ్మకు ధైర్యం చెప్పాలి మీరు."
"అదృష్టం. మీ నాన్న చనిపోయాక మీరు రాలేదు.”
“మృత్యువుకు చేరువు అవుతున్నాను అని ఎందుకో మీ నాన్నకు అనిపించింది.”
"మీ నాన్న ఏ వైద్య పరీక్షలు చేసుకోక ముందు మృత్యువు చేరువలోవున్నది అని తెలుసు కున్నాడు. ఏదో శక్తి మీ నాన్నలో ఉంది. ఆయన పోయే వరకు ప్రతి రోజూ ఆయనకు ఆనందం ఇవ్వండి. క్యాన్సర్ చివరి రోజులు చాలా బాధగా ఉంటాయి. కొందరు ఎన్నో నెలలు ఇబ్బంది పడతారు. మీ నాన్న ఈ విషయం లో అదృష్టవంతుడు.
చివరిలో తెలిసింది. పైగా ఇప్పటి వరకు పెద్ద ఇబ్బందులు పడలేదు” అన్నాడు డాక్టర్ "
"అమ్మ చేసే పూజలు అయి ఉండవచ్చు డాక్టర్!"
“అయ్యి ఉండవచ్చు”
“నేను ఈ ఆసుపత్రిలో చాలా సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. మీరు నాకు బాగా దగ్గర బంధువులు కాబట్టి చెబుతున్నాను. నేను చెప్పినట్లు చెప్పకుండా మీ నాన్నను డిశ్చార్జ్ చెయ్యమని అడగండి"
***
"నాన్నా! నీకు ఇష్టమని ఆవిరి కుడుము చేశాను."
“ఆకలిగా లేదు తల్లి”
"చీరలో మీ ఇద్దరూ మహాలక్ష్ముల్లా ఉన్నారు."
"మీ అక్క రాలేదా!"
"పక్కనే ఉంటుంది. కానీ రాదు. దాని ధోరణి ఏమిటో!?"
"అన్నయ్యా! నువ్వు ఇష్టం చేసుకుని కాస్త తినాలి. కాస్త తింటేనే కదా బలం వచ్చేది" పెద్ద చెల్లెలు అన్న భుజం పట్టుకుని ఇదుగో రెండు ముద్దలు తినుఅన్నయ్యా!"అంది.
"అన్నయ్యా! నా చేతి ముద్దా తినాలి" అంటూ చెల్లెలు కూడా ఆప్యాయంగా తినిపిస్తుంటే బావలు ఇద్దరూ ఎదురుగా కూర్చున్నారు.
“మనం పద్నాలుగు మంది సంతానం. అమ్మ పని చేసుకుంటుంటే నువ్వూ, పెద్దన్నయ్య మాకు వద్దన్నా కుక్కి కుక్కి తినిపించే వాళ్ళట అన్నారు చెల్లెళ్ళు."
"అయితే ఇప్పుడు నా ఇద్దరు చెల్లెళ్ళు ఆ కక్ష తీర్చు కుంటున్నారు అన్నమాట" అన్నాడు నవ్వబోయి రొప్పుతూ.
అందరూ పెద్దగా నవ్వేశారు.
"మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత సందడి చిన్నప్పుడు ఉండేది" అన్నాడు తన కుటుంబాన్ని, తమ్ముళ్లను, మరదళ్ళను వారి పిల్లల్ని చూస్తూ... "మీరంతా నా బలం. నా బలగం" అంటున్న అతని కళ్లలో చిన్న కన్నీటి జీర ఛాయగా కదలాడింది.
***
"నా తమ్ముళ్లు, నా వాళ్ళు అందరూ నాకు బాగోలేదని రోజూ చూడ్డానికి వస్తుంటే చిన్నప్పుడు తప్పి పోయిన బాల్యం నాకు ఎదురు పడినట్లు ఉంది. అమెరికాలో ఇంచు మించు ఇరవై సంవత్సరాలు ఉండి ఏమి కోల్పోయానో ఇప్పుడు అర్థం అవుతుంది. ఆ యాంత్రిక జీవితం... ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న బాధ."
"తాతయ్యా ! రొప్పుతున్నారు మీరు ... మాట్లాడకండి” అన్నాడు పెద్ద మనవడు.
"మీరంతా వెళ్ళాక అంతా విశ్రాంతి... రేపు మళ్ళీ మీరు వచ్చే వరకు. ఉదయం కోసం ఇప్పుడు నేను ఎదురు చూసినంత ఎప్పుడూ జీవితంలో చూడలేదు. సూర్యుడు చాలా అందంగా అనిపిస్తున్నాడు. రాత్రి చందమామ నిద్రపోనీయడు. మీతో కబుర్లు చెప్పాలి అని నిద్ర మాత్ర వేసుకుని పడుకుంటున్నాను.”
"మామయ్యా! బాగా రొప్పుతున్నారు. మాట్లాడకండి!" అన్నారు అమెరికా నుండి వచ్చిన అల్లుళ్ళు మామగారికి రెండువైపులా నిలబడి భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా తీసుకుని.
మీరంతా రోజూ ప్రొద్దుటే నాకోసం రావడం ఎంతో ఆనందంగా ఉంది.
***
"నాన్నా! మీకు సహస్ర చంద్ర దర్శనం పూజలు మేము ఇక్కడ లేము అని చెయ్యలేదు. అయ్యగారికి నీచేత కొన్ని దానాలు ఇప్పించాలి అని మేమందరం ముచ్చట పడుతున్నాము" అన్నారు కూతుర్లు ముగ్గురూ ఏక కంఠంతో.
"మనకు ఆ ఆనవాయితీ ఉందా!? నాకు గుర్తు లేదు"
"మంచి ఎవరి దగ్గర నుండైనా తీసుకోవచ్చు అని మహాభారతంలో విదురుడు చెప్పాడు అని చెబుతుంటావుగా నువ్వు. నీ చేత, అమ్మ చేత ఈవేడుక చేయించడం మా అందరికీ ఇష్టం” అన్నారు కూతుళ్ళు.
"అలాగే మాకందరికీ వడిబియ్యం మీరూ, అమ్మా పోయించాలి.. పుట్టింటి నుండి స్త్రీ పోయించుకునే వడిబియ్యం ఐశ్వర్యాన్ని ఇస్తుంది అంటావుగా!' అంది పెద్ద కూతురు
***
"అన్నయ్యా! ఇదుగో ఈ పట్టు పంచి కట్టుకోండి."
"ఓపిక లేదు. తమ్ముడూ!"
"అన్నయ్యా! నీకు గుర్తు ఉందా!? పెద్దన్నయ్యా, నువ్వూ, మా చిన్నప్పుడు మాకు స్నానం చేయించి బట్టలు వేసేవాళ్ళు. ఒకసారి నేనూ, ఆకరి తమ్ముడు కాలవలో ఈది బురదతో వచ్చాము. నువ్వు మా ఇద్దరినీ రెండు దెబ్బలు వేసి స్నానం చేయించి బట్టలు వేశావు" అంటూ మాట్లాడుతూ తమ్ముళ్లు బట్టలు మార్చారు అన్నయ్యకు. అందరి ముఖాల్లో త్వరలో అన్నయ్యను కోల్పోతున్నాం అనే వేదన ఉన్నా పైకి మాత్రం అన్నయ్యకు బాధ కనబడనీయకుండా దిగమింగు కొంటున్నారు.
"వదినా! ఈ పట్టు చీర కట్టుకో!" అంటూ ఇద్దరు ఆడ బడుచులు, తోడి కోడళ్ళు చుట్టు ముట్టారు.
"నాకు ఇవన్నీ ఈ సమయం లో ఎందుకు?"
"వదినా! ధైర్యంగా ఉండు. ఈ చిన్న సంతోషాలు మన రేపటి జీవితంలో తీపి జ్ఞాపకాలు అంటున్న ఆడపడుచుల తో పాటు , తోడికోడళ్ళ కళ్లు చెమర్చినాయి.
***
కుటుంబంలో స్త్రీలకు ఒడి బియ్యం పోయించడానికి సిద్ధం చేయించాడు.
చేయించి సాయంత్రం నిండు చంద్రునికి హారతి ఇప్పించారు.
బయట చాలా సందడిగా వుంది.
ఆ దంపతులను కూర్చో పెట్టి దండలు వేయించి... ఐదుగురు అయ్యవార్లకు భూదానం, గోదానం, స్వర్ణ దానం, వస్త్ర దానం మొదలైన దానాలు చేయంచారు కుటుంబ సభ్యులు..
"మీరు చాలా అలసిపోయారు. ఇళ్లకు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అసలు ఈరోజు మిమ్మల్ని ఇక్కడే ఉండమనాలి అని వుంది. ఇల్లు చాలదు. మీరంతా రేపు తొందరగా రండి. మీకు నేను ఒక విషయం చెప్పాలి." అన్నాడు.
"ఇప్పుడు చెప్పన్నయ్యా!" అన్నారు అందరూ ఏక కంఠంతో.
"కాదు. రేపే చెబుతాను" అన్నాడు గొంతులో కాస్త గంభీరం నింపు కుంటూ.
***
అన్నదమ్ములు, బంధువులు అందరూ వచ్చారు.
"అన్నా! రేపు తప్పక రావాలి ఏదో చెబుతాను అన్నావు.
అదేమిటో చెప్పకుండా మమ్ముల్ని వదిలి వెళ్ళి పోయావు" అంటూ గుండె బాదుకుని ఏడ్వసాగారు. ఆ ఏడుపుకు దిక్కులు పిక్కటిల్లుతున్నాయి.
"ఏమి చెప్పాలి అనుకున్నాడో? అన్నయ్య!?" అంటూ
పెద్దగా ఏడుస్తున్నారు.
"మీరంతా వెళ్ళి పోయాక నేనూ అక్కా ...
“నాన్నా! ఏమి చెప్పాలి అనుకున్నావు అందరికీ అని అడిగాము."
"నాన్నకు ఉన్న ఇళ్ళల్లో ఒక ఇల్లు మీ అందరి పేరునా రాయాలని, ఆ ఇంట్లో మీరంతా అప్పుడప్పుడు కలుసుకోవాలని ఉంది" అన్నారు.
ఇంకో కోరికగా... "అందరితో కలిసి బలగం సినిమా చూడాలి అని ఉంది" అన్నారు.. అని చెబుతున్న చిన్న కూతురి గొంతు గధ్గధమైంది.
***
*శ్రీదేవీ శ్రీకాంత్*
శ్రీదేవీ శ్రీకాంత్ స్వస్థలం హైదరాబాద్. ప్రస్తుతం ఆఫ్రికాలోని బోట్స్ వాన దేశంలో ఉంటున్నారు. ట్రాన్స్ లేషన్ స్టడీస్ లో పీహెచ్డీ చేశారు. మొత్తం 5 పీజీలు రెండు PhD లు చేశారు. ప్రస్తుతం క్లినికల్ సైకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ 163 కథలు, 1750 తెలుగులో గజల్స్,, 56 హిందీ గజల్స్, కొన్ని ఆంగ్ల గజల్స్ రాశారు. రెండు వందలకుపైగా తెలుగు కవితలు, అనేక నానీలు, భక్తి పాటలు, హైకూలు, జాన పద పాటలు రాశారు. ఆంగ్ల కవితలు,ఆంగ్ల పాటలు, సైకాలజీలో నాలుగు పుస్తకాలు (ఆంగ్లంలో) తీసుకొ చ్చారు. The Solaris Bloom ఆంగ్ల కవితా పుస్తకాన్ని ప్రచురించారు. భారత్ మాతా కీ జై కథల పుస్తకం, దరహాస్ చంద్రికలు గజల్స్ పుస్తకం, తప్త తరణి నాటిక, తప్త తరణి నాటిక పుస్తకం, విశ్వ విలాపం గేయ కావ్యానికి తానా వారి ఉత్తమ గేయ పురస్కారం వచ్చింది.
Comments