కరిగిన మేఘం
- vinoo Sparkles
- Sep 9
- 6 min read
✍️ లక్ష్మి ప్రశాంతి - 7893399773
నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం' సంయుక్తంగా నిర్వహించిన 'కథల పోటీ-2023/24'లో రూ.2 వేల బహుమతి పొందిన కథ

ఆమెలో ఎలాంటి కదలిక లేదు. మరోసారి కొంచెం గట్టిగా పిలిచాడు. ఈసారి అతని పిలుపు ఆమె చెవులను తాకినా రాత్రి వేసుకున్న మందుల ప్రభావం వల్ల కళ్ళు తెరవలేకపోయినా ఆ పిలిపులోని ప్రేమ ఆమె మనసుకు తెలుస్తోంది. ఆమెను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టంలేనివాడిలా మేఘ తల నిమురుతూ ఉండిపోయాడు ఆకాశ్.
కొంతసేపటికి మెలుకున్న మేఘ "గుడ్ మార్నింగ్ " అంది ఆకాశ్ ని చూస్తూ.
"గుడ్ మార్నింగ్. త్వరగా ఫ్రెషై రా. ఈరోజు నీకిష్టమైన టిఫిన్ చేశాను". ఊరిస్తున్నట్టుగా అంటూ బద్ధకంగా ఉన్న ఆమెను బలవతంగా బాత్రూం లోకి తోసాడు ఆకాశ్.
మేఘ వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చోగానే హాట్ బాక్స్ లోంచి వేడిగా ఉన్న ఉప్మా పెసరట్టుతో పాటు అల్లంచట్నీ ఆమె ప్లేట్ లో వడ్డించి "టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మేడం" అంటూ తనూ వడ్డించుకున్నాడు.
అతని మాటలకు పెసరట్టు ముక్క తుంచుకుని తింటున్న మేఘ చిన్నగా నవ్వి "చాలా బాగుంది ఆకాశ్" అంది. ఇద్దరు మాటల్లో పడిపోయారు.
ఈ మధ్య మేఘలో చాలా మార్పు కనిపిస్తోంది. మొదట్లో తనతో మాట్లాడటానికే పెద్దగా ఇష్టపడని మేఘ ఇప్పుడు బాగానే మాట్లాడుతోంది .తను ఇంకొంచెం ఓపిక పడితే చాలు ఆమె మనసులో భయాలన్నీ తొలగిపోయి అందరాడపిల్లల్లాగానే తను మాములుగా అవుతుంది. అప్పుడిక మా వైవాహిక జీవితం కూడా ఆనందమయం అవుతుంది అనుకున్నాడు తనతో ఉత్సాహంగా కబుర్లు చెబుతున్న మేఘను చూస్తూ.
"మేఘా టాబ్లెట్స్ వేసుకో" టిఫిన్ తిని సోఫాలో ఫోన్ చూస్తూ కూర్చున్న మేఘకు మెడిసిన్స్, వాటర్ బాటిల్ అందిస్తూ అన్నాడు ఆకాశ్.
అవి చూడగానే ఆమె మొహం అప్రసన్నంగా మారిపోయింది.
"ప్లీజ్ ఆకాశ్ తర్వాత వేసుకుంటాను" అంది వాటిని పక్కన పెట్టేస్తూ.
"మేఘా ఇవి నీకోసం కాదు. నాకోసం, మనకోసం. నువ్వు అందరమ్మాయిల్లాగా నార్మల్ లైఫ్ లీడ్ చెయ్యడానికి వేసుకోవాలి. జరిగిందేదైనా అది గతం మేఘా. దాన్ని ఎంత త్వరగా మర్చిపోతే నువ్వు అంత సంతోషంగా ఉండగలవు".
ఆమెకు నచ్చచెబుతున్నట్టుగా అన్నాడు ఆకాశ్. మెల్లగా అతని చేతుల్ని ఆమె చేతుల్లోకి తీసుకోని పెదవుల వరకు తీసుకువెళ్ళింది కానీ ముద్దు పెట్టుకోలేకపోయింది. ఆక్షణం ఆకాశ్ ని చూడాలంటే ఆమెకు గిల్టీగా అనిపించింది. ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది ఆమెను రక్షించడానికి అన్నట్టు. ఆకాశ్ తన చిన్ననాటి స్నేహితుడే కాదు. తన గురించి అంతా తెలిసి కూడా తనను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి. పెళ్ళైన నాలుగు నెలల్లో అతనికి భార్యగా దగ్గర కాలేకపోయినా ఏమాత్రం అడ్వాంటేజ్ తీసుకోకుండా తనంతట తను అతనికి దగ్గరయ్యే క్షణాలకోసం ఓర్పుగా ఎదురుచూస్తున్నాడు. ఆమె పరిస్థితి మెరుగుపర్చడానికి సైకియాటిస్ట్ దగ్గకు తీసుకెళ్లాడు. అప్పటి నుండి మెడిసిన్స్ వాడుతూనే ఉంది. ఆ మందులకంటే కూడా ఆకాశ్ ప్రేమే మేఘను ఎక్కువ కదిలిస్తోంది. మగాళ్లను చూస్తేనే ముడుచుకుపోయే మేఘ ఆకాశ్ తో మనస్ఫూర్తిగా మాట్లాడుతోంది. అతనికి దగ్గరవ్వాలనే ఆశ ఆమె అంతరాంతరాళాల్లో ఉంది. ఆ దుర్గటన తాలూకా జ్ఞాపకాలు ఆమెలో ఘనీభవించి మేఘను గతం నుండి బయటకు రానీయకుండా చేస్తున్నాయి. మేఘకు ఒక్కసారిగా ఏడవాలనిపించింది. మనసులో పేరుకుపోయిన దుఃఖమంతా కరిగిపోయేలా ఏడవాలని ఉంది .చివరిగా తను ఏడ్చి పదిసంవత్సరాలపైనే అయింది. ఆ సంఘటన తర్వాత తను ఎడవడమే మానేసింది. అమ్మానాన్నా, డాక్టర్లు ఎవరెంత ప్రయత్నించినా మేఘ ఏడవలేదు.
"మేఘా "అన్న ఆకాశ్ పిలుపుతో ఆలోచనల నుండి బయటకు వచ్చింది. ఫోన్ మాట్లాడి ఎప్పుడు వచ్చాడో చేతిలో టాబ్లెట్స్ పట్టుకొని మేఘనే చూస్తున్నాడు. మారుమట్లాడకుండా అతని చేతిలో టాబ్లెట్స్ తీసుకుని వేసుకొంది.
"గుడ్ గర్ల్" ఆమె తల నిమురుతూ" ఆఫీస్ కి వెళ్ళొస్తాను. ఏం ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. లంచ్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. అన్నీ నీకిష్టమైనవే చేశాను. ఒక్కటి కూడా మిగల్చకుండా తినాలి. ఓకే నా" అన్నాడు ఆకాశ్.
అప్పుడప్పుడు ఇలా వంట చెయ్యడం అతనికి అలవాటే. నవ్వుతూ తలూపింది మేఘ. వెళుతున్నవాడల్లా మళ్ళీ వెనకకు వచ్చి "టేక్ కేర్ మేఘా"అన్నాడు.
తల ఎత్తి ఆకాశ్ కళ్ళలోకి చూసింది.
ఆ కళ్ళలో అంతులేని ప్రేమ కనిపించింది. ఒక్కక్షణం అతని గుండెల్లో వాలిపోవాలనిపించింది మేఘకు. అంతలోనే ఎదో భయం ఆమెను వెనుకకు లాగింది. అది భయమో మరింకేదో స్పష్టంగా ఆమెకే తెలీదు.
"సరే" అన్నట్టు తలఊపి తలుపు వరకూ వెళ్లి అతన్ని పంపించి డోర్ లాక్ చేసుకొని టీవీ ముందు కూర్చున్న మేఘను గడిచిన చేదుజ్ఞాపకాలు పలకరించాయి.
"పెద్దమ్మకు ఏం కాదు అక్కా. నువ్వు ఏడవకు.మేఘను చూడు నువ్వేడుస్తుంటే ఎలా బిక్కమొహం వేసుకుందో" ఒకపక్క శారదని ఓదార్చుతూనే హడావిడిగా ఆమె లగేజ్ బ్యాగ్ సర్దుతోంది రూప.
"అవును వదినా అతయ్యగారికి ఏంకాదు. నువ్వు కంగారు పడకు. ముందు కళ్ళు తుడుచుకో".. భార్య రూపతో ఏకీభవిస్తూ శారదను సముదయించాడు ప్రకాష్.
"అది కాదు ప్రకాష్ మాములు అనారోగ్యమైతే ఫోన్ చెయ్యడు మా అన్నయ్య. ఉన్నపళంగా రమ్మన్నాడంటే ఆమ్మకు సీరియస్గానే ఉండి ఉంటుంది. సమయానికి మీ అన్నయ్య కూడా ఊర్లో లేరు. ఆఫీస్ పనంటూ ఊరేళ్లారు. నాకు కాలుచేయ్యి ఆడటంలేదు". అంది శారద.
"అన్నయ్యకు ఫోన్ చేశా వదినా. వెళ్లిన పని అవ్వగానే అటునుంచి ఆటే మీ ఇంటికి వస్తానన్నాడు" అన్నాడు ప్రకాష్.
ఒకపక్కన నుంచొని ఈ సంభాషణంతా వింటున్న మేఘ శారద దగ్గరకి వచ్చి "ఏమైందమ్మా అమ్మమ్మకి" అడిగింది.
"అమ్మమ్మకి ఆరోగ్యం బాగాలేదని మావయ్య ఫోన్ చేసాడమ్మా" కూతుర్ని దగ్గరికి తీసుకుంటూ చెబుతూనే... "రూప మేఘని నాతోపాటు తీసుకెళదామంటే రేపటినుండి తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి" అంది తోడికోడలు రూపవైపు చూస్తూ.
"మరేం పర్వాలేదు అక్కా. మేఘ మాయింట్లో ఉంటుంది" అంది రూప.
"అవుననుకో రూప. మేఘని వదిలి ఎప్పుడూ ఉండలేదు. తనను వదిలి వెళ్లాలంటే నాకెలాగో ఉంది" అంటున్న శారద దగ్గరకి వచ్చి.. "వదినా మేఘ మీకే కాదు మాకూ కూతురే. తన గురించి నేవ్వేమి దిగులు పడకు" ప్రకాష్ ధైర్యం చెప్పగా మేఘని వదలలేక వదిలి వెళ్ళింది శారద.
శారద భర్త శ్రీనివాస్ ప్రకాష్ సొంత అన్నదమ్ములు. శ్రీనివాస్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి శారదతో పెళ్ళై పదమూడేళ్లు కాగా వాళ్ళ పన్నెండేళ్ల గారాలపట్టి మేఘ. ఆమె ఇప్పుడు ఏడోతరగతి చదువుతోంది. ప్రకాష్ వ్యాపారం చేస్తూన్నాడు. అతనికి రూపతో వివాహమై అయిందేళ్లయింది. వాళ్లకు ఇంకా పిల్లలు లేరు. అన్నదమ్ములిద్దరూ వారసత్వంగా వచ్చిన స్థలంలో ఇళ్ళు కట్టుకున్నారు. శారద రూప కూడా సొంత అక్కాచెల్లెళ్లలా కలిసిపోయారు. ఇంతవరకూ ఎప్పుడూ తల్లిని వదిలి ఉండకపోవడంతో మేఘకి చాలా బెంగగా ఉంది. అది గమంచిన రూప మేఘతో సరదాగా మాట్లాడుతూ ఆమె బెంగ పోగొట్టడమే కాక మరుసటిరోజు పరీక్షకి సిద్ధం చేసింది. ఏడున్నరకల్లా మేఘకి టిఫిన్ పెట్టడంతో పాటు ఆమెకు తనకు లంచ్ బాక్స్ లు సర్డింది రూప. రూప ప్రెవేట్ కాలేజీలో పనిచేస్తుండటంతో ఉదయం లంచ్ తీసుకోని వెళితే తిరిగి వచ్చేది సాయంత్రం అరింటికే.అందువల్ల మేఘని స్కూల్ కి తీసుకువెళ్లి తీసుకొచ్చే బాధ్యత ప్రకాష్ తీసుకున్నాడు. శారదవాళ్ళ అమ్మగారికి హార్ట్ఎటాక్ వచ్చిందని సమయానికి హాస్పిటల్ కి తీసుకువెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిసి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు ప్రకాష్ దంపతులు.ఆఖరి పరీక్ష వ్రాసి ఇంటికి వచ్చింది మేఘ.ఫోన్ మోగడంతో పరిగెత్తుకుంటూ వెళ్లి ఫోన్ తీసింది.తను ఊహించినట్టుగానే వాళ్ళమ్మ శారద దగ్గరనుంచి ఫోన్.పరీక్షలన్నీ బాగా వ్రాసానని ర్యాంక్ గ్యారెంటీ అని ఆనందంగా తల్లితో చెప్పింది.అమ్మమ్మకి తగ్గిపోయిందని రాత్రి బస్ కి బయల్దేరి నేను నాన్నా వచేస్తున్నామని శారద చెప్పడంతో మేఘ ఆనందం రెట్టింపు అయింది.కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి గుమ్మంలో ప్రకాష్ నుంచొని ఉన్నాడు. కాలేజీ నుండి వచ్చేసరికి తెరిచివున్న తలుపుల్ని చూసి ఆశ్చర్యపోతూ ఇంట్లోకి అడుగుపెట్టింది రూప.ఇది ప్రకాష్ ఇంట్లో ఉండే సమయం కాదు.మేఘని స్కూల్ నుంచి ఇంట్లో దింపి వెళ్ళిపోతాడు.మేఘ ఉన్నా తలుపులు వేసే చదువుకోవడమో, రాసుకోవడమో చేస్తోంది. అలాంటిది తలుపులు తెరిచి ఉండటం మేఘ కూడా ఎప్పటిలాగా హాల్లో లేకపోవడంతో .. "మేఘా" అని పిలుస్తూ లోపలికి వెళ్ళింది.
సమాధానం లేదు. ఇల్లంతా వెతికింది. చివరిగా బెడ్రూమ్ లోకి వెళ్లి చూసేసరికి మంచంపైన చెదిరిన దుస్తులతో రక్తమోడుతూ కనిపించింది మేఘ. తను చూస్తున్నదేమిటో అర్ధం కాలేదు రూపకి. మరింత పరిశీలనగా చూసేసరికి మేఘ లేతశరీరం నిండా గోళ్ళగాట్లు, పంటిగుర్తులు. ఏం చెయ్యాలో తోచనట్టుగా ఒకక్షణం ఆలా నుంచుండిపోయింది రూప. ఆతరువాత ప్రకాష్ కి ఫోన్ చేసి విషయం చెప్పింది.
మేఘని తడుతూ లేపసాగింది. ఆమెలో ఎలాంటి చలనం లేదు. వంటింట్లోకి పరిగెత్తి ఫ్రిజ్ లోంచి వాటర్ బాటిల్ తీసుకువచ్చి మేఘ మొహం మీద జల్లింది. ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. మేఘని చూస్తుంటే కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి రూపకి. ఈలోగా ప్రకాష్ రావడంతో మేఘని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు.
"హలో అక్కా మీరు త్వరగా బయల్దేరి రండి. మేఘకి వంట్లో బాలేదు"శారదతో చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది రూప.
రూప చెప్పిందేమిటో శారదకు అర్ధం కాలేదు. సాయంత్రం తనతో బాగానే మాట్లాడిన మేఘకి ఉన్నటుండి ఆరోగ్య పాడవడం ఏంటి?అదే విషయం ఫోన్ చేసి అడిగింది శారద.
"అక్కా నువ్వు, బావగారు వచ్చెయ్యండి. అంతకుమించి నన్నేం అడగకు" ఏడుస్తూ అంది రూప.
శారదకు అంతా అయోమయంగా ఉంది. వెంటనే బయల్దేరారు శారద శ్రీనివాస్ లు.
ఒంటినిండా గాట్లతో సృహలేకుండా ఉన్న మేఘని చూడగానే మతిపోయినట్టు అయింది శారద, శ్రీనివాస్ లకు.
అప్పుడే రౌండ్స్ కి వచ్చిన డాక్టర్ మేఘపై ఎంత దారుణంగా అత్యాచారం జరిగిందో చెబుతొంటే ఏడుస్తూ కుప్పకూలిపోయింది శారద. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. నిద్రహారాలు మాని మేఘ దగ్గరే పిచ్చిదానిలా కూర్చొని ఉంది. ఎవరెంత బతిమాలినా భోజనం కాదుకదా కనీసం కాసిన్ని టీనీళ్లు కూడా తాగలేదు. పైకి నిబ్బరంగా కనిపిస్తోన్న భార్యాబిడ్డని చూస్తోంటే గుండె పగిపోతున్నట్టు ఉంది శ్రీనివాస్ కి.
రెండురోజుల తర్వాత సృహలోకి వచ్చిన మేఘ ఆమె పరిక్షిస్తున్న డాక్టర్ ని చూడగానే పెద్దగా అరుస్తూ అతన్ని దూరంగా తోసేసింది. తల్లితండ్రి ఎంత ఆపాలని ప్రయత్నించ్చినా మేఘ ప్రతిఘటించడమే కాకుండా మరింత బలంగా తండ్రిని సైతం దూరంగా నెట్టేసింది.
కొంతసేపటికి మామూలైన కూతుర్ని అడగలేక అడిగింది శారద.
"చిట్టితల్లి నిన్నెవరు ఇలా చేశారు. అసలేం జరిగిందమ్మా"
తల్లి మాటలు వినబడనట్టు శూన్యంలోకి చూస్తూఉన్న మేఘ నిమిషం తర్వాత ఆరోజు జరిగిందతా చెప్పసాగింది. "బాబాయ్ అమ్మా. ఆరోజు నీతో ఫోన్లో మాట్లాడక బయటకు వెళ్లిన బాబాయ్ మళ్ళీ ఇంటికి వచ్చాడు. నేను ఎగ్జామ్స్ బాగా రాసినందుకు చాక్లైట్స్ తీసుకొచ్చానన్నాడు. అవి నాకు ఇచ్చి పక్కన కూర్చొని నా ప్రైవెట్ పార్ట్స్ ని తడమసాగాడు. నాకు చాలా భయం వేసిందమ్మా. వద్దని ఎంతచెబుతున్న వినకుండా నన్ను బెడ్రూమ్ లోకి తీసుకువెళ్లి..." చెబుతున్న మేఘ భయంతో చిన్నగా వణుకుతోంది.
"ఇంకేమీ చెప్పొద్దు మేఘ. నాకు అర్థమైంది" ఆపై వినలేనట్టు ఏడుస్తూ కూతుర్ని కౌగిలించుకుంది శారద. అక్కడే ఉన్న రూప మేఘ చెప్పిందంతా విని నిర్ఘాంతపోయింది.
మేఘ సృహలోకి వచ్చినప్పటినుంచి ప్రకాష్ ఎందుకు కనిపించకుండా పోయాడో అర్థమైంది రూపకి. ఒకరికౌగిలిలో ఒకరు ఒదిగిపోయి నరకాయతన అనుభవిస్తోంన్న తల్లికూతుళ్ళను క్షమాపణ అడగాలనిపించినా పసిపాపకి రక్షణ ఇవ్వలేని తను, ఆపాపని చిదిమేసిన ప్రకాష్ క్షమకి అర్హులు కాదనిపించి మౌనంగా బయటకు నడిచింది.
కాసేపటికి తేరుకున్న శారద కోపంగా రూప ప్రకాష్ ల కోసం చూసింది. వారిద్దరూ కనిపించలేదు.
మేఘకి ఇంజక్షన్ చెయ్యడానికి నర్స్ వచ్చింది. ఇంజక్షన్ చేయించుకోవడానికి మేఘ ఏడ్చి గోల చేస్తుందని తెలిసిన శారద తనను గట్టిగా పట్టుకొంది. నర్స్ ఇంజక్షన్ చేసి వెళ్ళిపోయినా మేఘ ఏడవలేదు. అప్పుడు గమనించింది శారద.మేఘ శారీరకంగా, మానసికంగా ఎంత బాధ అనుభవిస్తోన్నా ఏడవడంలేదన్న విషయాన్ని.
ప్రకాష్ చేసిన దుర్మార్గం గురించి చెప్పేట్టప్పుడు కూడా ఆమె మొహంలో భయం, బాధ కనిపించయే తప్ప కంటినుండి ఒక్క కన్నీటిచుక్క కూడా రాలేదు.
సంవత్సరం గడిచింది ఉన్న ఊరిని వదిలేసి వచ్చి. సైకియాటిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక మేఘలో మార్పు కనిపిస్తోంది. మొదట్లో తండ్రిని చూసినా ఒణికిపోయే మేఘ ఇప్పుడు శ్రీనివాస్ తో బానే మాట్లాడుతోంది కానీ మగవాళ్ళ పట్ల ఏర్పడిన భయం, విముకత అలాగే ఉండిపోయాయి. తన స్నేహితులంతా అమ్మాయిలే. మేఘ బిటెక్ పూర్తి అయ్యాక తన చిన్ననాటి స్నేహితుడైన ఆకాశ్ పెళ్లి ప్రపోజల్ పెట్టాడు మేఘ తల్లితండ్రుల దగ్గర.
మేఘ గురించి అంతా తెలిసిన ఆకాశ్ ఆమెను పెళ్లి చేసుకుంటాననడంతో శారద దంపతులు ఆనందంలో మునిగిపోయారు. పెళ్ళికి రెండు కుంటుబాలకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఉన్నదల్లా మేఘకే. ఆమెకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. పురుషుడి నీడను కూడా భరించలేని తను ఆకాశ్ ని పెళ్లి చేసుకొని తన మనసులో, జీవితంలో స్థానం ఎప్పటికి ఇవ్వలేదు. అదేవిషయం సున్నితంగా ఆకాశ్ కి చెప్పింది.
గతం ఆమెను ఎంతగా గాయపరిచిందో అర్ధం చేసుకున్న ఆకాశ్ ఆమె అంటే తనకి ఎంత ఇష్టమో చెప్పాడు. పెళ్ళైనా ఆమె మనసు మారేంతవరకూ ఎదురుచూస్తానని, ఆమెకి కష్టం కలిగించేలా ప్రవర్తించనని మాట ఇచ్చాడు. మరోవైపు తల్లితండ్రులు "మేఘ నీకు ఇష్టం లేకుండా మేము ఏ పని చెయ్యము. నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది" అంటున్నా తను అంగీకరించాలనే ఆశ వారి కళ్ళల్లో కనిపిస్తోంది. తల్లితండ్రుల్ని బాధ పెట్టడం ఇష్టంలేక, ఆకాశ్ ఇచ్చిన మాటమీద నిలబడతాడనే నమ్మకంతోనూ పెళ్లికి సరే అంది మేఘ. ఫోన్ రింగ్ అవడంతో ఆలోచనల్లోంచి తేరుకొని ఫోన్ తీసుకుంది.
"భోజనం చేసావా మేఘా " అడిగాడు ఆకాశ్.
"లేదు ఆకాశ్. నువ్వు తిన్నావా" అంది మేఘ.
"తింటూనే నీతో మాట్లాడుతున్న మేఘ. టైమ్ చాలా అయింది. నువ్వూ తిను" అన్నాడు.
"సరే ఆకాశ్" ఫోన్ పెట్టేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది.
ఉదయం అన్నట్టుగానే అన్నీ ఆమెకు ఇష్టమైనవే చేసాడు ఆకాశ్. భోజనం అయ్యాక ఫోన్లో మునిగిపోయింది మేఘ. పెద్దగా ఉరమడంతో ఫోన్ చూస్తున్న మేఘ ఒకసారిగా ఉలిక్కిపడింది. వంటింట్లోకి వెళ్లి కాఫీ పెట్టుకొని బాల్కనీలోకి వచ్చింది. శ్రావణమాసం కావడంతో ఆకాశం అంతా మబ్బు పట్టి వర్షించడానికి సిద్ధంగా ఉంది. ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కాఫీ తాగింది. సన్నగా జల్లు ప్రారంభమైంది. ఉన్నట్టుండి గుర్తొచ్చింది మేఘకి ఉదయం పని చేసి వెళుతూ కాస్త ఎండగా ఉండటంతో పద్మ టెర్రస్ పైన బట్టలు ఆరేసిన విషయం. హడావిడిగా టెర్రస్ పైకి వెళ్ళింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆమె మనసు బగ్గుమంది. మేఘవాళ్ళ పక్కఫ్లాట్ లో ఉండే కరుణాకర్ ఎదురు ఫ్లాట్ లో ఉండే ఆరేళ్ళ పింకీపై అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు.
మేఘలో కోపం, ఆవేశం పోటీ పడ్డాయి. చుట్టూ చూసింది. ఒకపక్కగా ఉన్న పూలకుండీల దగ్గర ఇనుపచువ్వ కనిపించింది. మరోఆలోచన లేకుండా అది తీసుకోని కరుణాకర్ని కొట్టసాగింది. అతను కొట్టవద్దని వారించినా, చేతులు జోడించి ఎవరికీ చెప్పొదని ప్రాధేయపడినా వినిపించుకోలేదు. చివరికి మేఘను తప్పించుకొని వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిపోగానే ఏడుస్తూ మేఘని చుట్టేసింది పింకీ. అప్పుడు మొదలైంది మేఘ మనసులో కదలిక. ఎన్నోఏళ్లుగా ఘనీభవించిన దుఃఖం ఉప్పెనలా పొంగింది. తనివితీరా గుండెభారమంతా దిగిపోయేలా ఏడ్చింది. ఇప్పుడు మేఘ హృదయం వర్షించిన ఆకాశంలా ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతత మేఘ, ఆకాశ్ ల కొత్తజీవితానికి నాందివాక్యం అయింది.
*
లక్ష్మి ప్రశాంతి పరిచయం
రచయిత్రి లక్ష్మి ప్రశాంతి.. తల్లి ప్రోత్సాహంతో కళాశాల స్థాయి నుండి కవితలు వ్రాయడం ప్రారంభించి వివిధ పత్రికలకు పంపేవారు.కొన్ని సంవత్సరాలు రచనలకు దూరమైనా సాహిత్యం చదవడం మాత్రం ఆపలేదు. పెళ్లి తర్వాత భర్త సహకారంతో తెలుగు సాహిత్యంతో పాటు బెంగాలీసాహిత్యం కూడా చదవడం మొదలుపెట్టారు. గత నాలుగేళ్ళనుండి మళ్ళీ రచనలు చెయ్యడం ప్రారంభించారు .తెలంగాణ సాహితీవారు విలువరించిన "తెలుగెత్తి జైకోట్టు "వ్యాససంకలనంలో "నాయిని కృష్ణకుమారి జీవితం -సాహిత్యంపై వ్యాసం వ్రాసారు.కరోనా కథలు సంకలనంలో "అస్తమయం "కథ ప్రచురితం అయింది. ముల్కనూర్ సాహితీపీఠం మరియు నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో 2021లో "నిషేధిత స్వప్నం " 2022లో ‘కెరటం’, 2023-2024లో "కరిగిన మేఘం" కథలకు బహుమతులు గెలుచుకున్నారు.
Comments